Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవి, పవన్ కల్యాణ్ లు విడిపోతేనే మేలన్నట్టు నెటిజన్లు ప్రవర్తిస్తున్నారు!: తమ్మారెడ్డి విమర్శ

చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ రేపు జరగనుంది. అయితే, ఈ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ వస్తారా? రారా? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పవన్ రావడం లేదంటూ నిర్మాత అల్లు అరవింద్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు తన వదిన, చిరంజీవి సతీమణి సురేఖ పవన్ ను ఆహ్వానించేందుకు స్వయంగా వెళుతున్నారనే వార్తలు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలో, సోషల్ మీడియాలో పలు కామెంట్లు పోస్ట్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. 'నా ఆలోచనలు' పేరిట యూట్యూబ్ లో ఆయన ఓ వీడియోను అప్ లోడ్ చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ల భావజాలాలు వేర్వేరుగా ఉన్నంత మాత్రాన వారిద్దరూ విడిపోవాలి, కత్తులు దూసుకోవాలి అనే రీతిలో సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారంటూ తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి లేకపోతే పవన్ లేడనే విషయాన్ని గుర్తించాలని... 'ఖుషి' సినిమా హిట్ అయిన తర్వాత పవన్ గురించి చిరంజీవి చాలా గొప్పగా చెప్పుకున్నారని ఆయన అన్నారు.

అంతేకాదు, 'డాడీ' సినిమాలో పవన్ కంపోజ్ చేసిన ఫైట్ ను వాడుకున్నారని చెప్పారు. అన్న చిరంజీవి అంటే పవన్ కు ఎంతో ఇష్టమని తెలిపారు. రాజకీయపరంగా కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నంత మాత్రాన వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వారిద్దరూ విడిపోతేనే బాగుంటుందనేది నెటిజన్ల అభిప్రాయంలా ఉందని అన్నారు. వీలైతే కలిపే ప్రయత్నం చేయాలి కానీ... విడగొట్టే పని మాత్రం చేయొద్దని నెటిజన్లకు హితవు పలికారు. 

More Telugu News